రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా దానికి ఒక విశిష్టత ఉంటుంది. శ్రీరామ కథను ఎక్కడ ప్రదర్శించినా ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోతుంది. అనిర్వచనీయమైన అనుభూతికి ప్రతి ఒక్కరూ లోనవడం అత్యంత సహజంగా జరిగిపోతుంది. భారతీయులకు శ్రీరామునితో ఉండే అనుబంధం అటువంటిది. రామయనంతో ఉండే బంధం అలాంటిది. రామాయణం ఎన్ని సార్లు సినిమాగా వచ్చినా అన్నీ సార్లూ అందరినీ ఆకట్టుకుంది.
ఇప్పుడు మళ్ళీ శ్రీరాముని కథామృతం అంతర్జాతీయ స్థాయిలో ఆదిపురుష్ గా వెండితెర మీద సందడి చేయబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు తిరుపతిలో అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ప్రముఖ దర్శకుడు ప్రశాంత వర్మ ఆధ్వర్యంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రభాస్ తో పాటు దర్శకుడు ఓం రౌత్ ఇతర సినీ ప్రముఖులు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇక ఈరోజు సాయంత్రం చిన జీయార్ స్వామి వారి సమక్షంలో వేడుక నిర్వహించడానికి సర్వం సిద్ధం అయింది.
సరిగ్గా ఈ సమయంలో సినిమా యూనిట్ నుంచి అపురూపమైన అప్ డేట్ ఒకటి వచ్చింది.. ఇంతవరకూ చలన చిత్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్ లో ఒక సీటు ఖాళీగా వదిలిపెట్టబోతున్నారు. సినిమా ప్రదర్శించే అన్నీ రోజులూ కూడా ఇదే విధంగా ప్రతి థియేటర్ లో ఒక సీటును ప్రత్యేకంగా ఖాళీగా వదిలివేస్తారు.. ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది రామాయణం గురించి బాగా తెలిసిన వారికి అర్ధం అయ్యే ఉంటుంది.
అవును.. ఆ ప్రత్యేక సీటు హనుమంతుడి కోసం. ఎందుకంటే.. ప్రపంచంలో ఎక్కడ రామాయణ పారాయణం జరిగినా.. రామ కథ చెబుతున్నా.. చూపిస్తున్నా.. అక్కడికి ఆంజనేయుడు వచ్చి చూస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే సాధారణంగా మన ఊళ్ళలో రామాయణ పారాయణం చేసేటప్పుడు ఒక ప్రత్యేక ఆసనం అంజనీపుత్రుడి కోసం వేస్తారు. అదేవిధంగా శ్రీరామ గాధను న భూతో న భవిష్యతి అన్న విధంగా వెండి తెరపై ఆవిష్కరిస్తున్న ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే ప్రతి చోట.. ఒక సీటును రామ భక్త హనుమాన్ కోసం కేటాయిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పింది. శ్రీరాముని కథామృతాన్ని ఆధునిక విధానంలో వెండితెరపై ఆవిష్కరిస్తున్న ఆదిపురుష్ టీం తీసుకున్న ఈ నిర్ణయం రామ భక్తులకు అత్యంత ఆనందాన్ని ఇస్తోంది.