మన దేశంలో (India story)వివాదాలు కొత్త కాదు. అందులోనూ రాజకీయ వివాదాలు. గతంలో సిద్ధాంతాల రాద్ధాంతాలతో రాజకీయాలు నలుగుతూ ఉండేవి. కాలం మారింది.. పద్ధతులూ మారాయి.. రాజకీయ విన్యాసాలూ మారిపోయాయి. ఆధునిక రాజకీయానికి సిద్ధాంతంతో పనిలేదు. అసలు సిద్ధాంతం అనే మాట మర్చిపోయింది నేటి రాజకీయం. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. ఇంతే. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికార పక్షం ఏ పని చేసినా తప్పు అన్నట్టు యాగీ చేయడం.. అధికారంలోకి రాగానే అదే తప్పును ఒప్పు అంటూ ప్రజల నెత్తిన రుద్దే ప్రయత్నం చేయడం.. ఇదే ఇప్పటి రాజకీయం. తప్పుల మెట్లమీద.. సోషల్ మీడియా ప్రచారాల తివాచీ వేసుకుని అధికారాన్ని అందుకోవడం కోసమే రాజకీయ పార్టీల ప్రయత్నాలు. ప్రజలు అనే వారు ఉన్నారనీ.. వారికి మంచి చేయాలనీ.. ఇంకా చెప్పాలంటే వారి కనీస అవసరాలు తీర్చే ప్రయత్నాలు చేయాలనీ ఆలోచించే పార్టీ లేదు.. నాయకులూ లేరు. ఉన్నాడల్లా అధికారం ఎలా సాధించాలన్న తపన.. సాధించిన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎన్నిరకాల అడ్డదారులు తొక్కలన్న ప్రణాళికలు. ఇప్పుడు రాజకీయం అంటే అంతే.
వివాదం ఇదీ..
ఇప్పుడు రాజకీయం అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది అంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జీ20 సమ్మిట్ కోసం ప్రచురించిన ఇన్విటేషన్ కార్డులో ఒక వాక్యంపై రేగిన రాజకీయ దుమారం చూసి. విషయం ఏమిటంటే.. G20 సదస్సులో పాల్గొనే ప్రపంచ నేతల కోసం రాష్ట్రపతి భవన్ లో ఒక విందు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 9న ఈ విందు ఇస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ఇన్విటేషన్స్ రెడీ చేసింది. ఇందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా (India story)అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. ఇంకేముంది ప్రతిపక్షాలకు బురద జల్లడానికి ఒక అవకాశం దొరికింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ రచ్చ మొదలైంది. నిజంగా ఇది రాజ్యాంగ విరుద్ధమా? అసలు మన దేశం పేరు భారతదేశమా? ఇండియా నా? కచ్చితంగా ఇండియా అనే చెప్పాలా? భారత్ అని అంటే తప్పేముంది? ఇలా ఎన్నో ప్రశ్నలు సామాన్యులకు రావడంలో తప్పులేదు. అందుకే ఈ వివాదంపై కొంత లోతుగా చెప్పుకుందాం.
భారతదేశం పేరు – ప్రాచీన కథలు
ప్రాచీన కాలం నుండి భారతదేశానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. జంబూద్వీపం, భరతఖండం, హిమవర్ష, అజ్ఞాతవర్ష, భరతవర్ష, భారత్, ఆర్యావర్త, హింద్, హిందుస్థాన్ మరియు భారతదేశం వంటివి. అయితే, వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన పేరు భారత్.
భారత దేశం(India story).. అసలు ఈ పేరు ఎలా వచ్చింది? దీనికి మూలం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ ముందుకు వెళదాం. మన దేశానికి ప్రాచీన కాలం నుంచి అనేక రకాల పేర్లు వాడుకలో ఉన్నాయి. ప్రతి పేరు వెనుకా ఒక కథ ఉంది. ప్రతి కథకూ ఒక పురాణం ఆలంబనగా ఉంది. భరతఖండం, హిమవర్ష, అజ్ఞాతవర్ష, భరతవర్ష, ఇండియా, ఆర్యావర్త, హింద్, హిందుస్థాన్ అలాగే భారతదేశం ఇలా చాలా పేర్లు మన దేశానికి ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఎక్కువ వాడుకలో నిలిచిన.. గతానికీ వర్తమానానికి వారధిగా నిలిచిన పేరు భారతదేశం. దానితో పాటు ఇండియా కూడా ఉంది.
భరతుడు-భారతదేశం
భారత దేశం(India story) అనే పేరు వెనుక ఉన్న కథలు చాలా ఉన్నాయి. వాటిలో దశరధుని కుమారుడు.. శ్రీరాముని తమ్ముడు భారతుడి కారణంగా భారత దేశం పేరు వచ్చింది అనే కథ ఒకటి. ఇంకా గట్టిగా అందరూ నమ్మే కథ.. దుష్యంతుడు.. శకుంతల కుమారుడు భరతుడు పేరు మీద భారత దేశం ఏర్పడింది అనే కథ. దీనినే ఎక్కువగా అందరూ నమ్మడానికి కారణం లేకపోలేదు. పురువంశ రాజైన దుష్యంతుడు.. శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. తరువాత ఆ విషయం మర్చిపోతాడు. శకుంతలకు భరతుడు పుడతాడు. తరువాత దుష్యంతుడికి తాను శకుంటాలను వివాహం చేసుకున్న విషయం గుర్తు వస్తుంది. ఆయన తరువాత రాజ్యాధికారానికి వచ్చిన భరతుడు.. జనరంజకమైన పాలన చేయయడమే కాకుండా.. అత్యంత ధైర్యసాహసాలతో నాలుదిక్కులనూ జయించి చక్రవర్తి అంటే నాలుదిక్కులలోనూ ఉన్న రాజులకు రాజుగా అయ్యాడు. నాలుగు దిక్కులూ అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించాడు. అందుకే ఈ నాలుగు దిక్కులలో ఉన్న రాజ్యాలను అన్నిటినీ కలిపి భారత వర్ష అనే పేరు వచ్చింది. ఈ విషయం ఋగ్వేదంలోని ఒక శాఖ అయిన ఐతరేయ బ్రాహ్మణంలో స్పష్టంగా ఉంటుంది. ఈ కథ ఇప్పటికీ మన జన బాహుళ్యంలో బాగా ప్రచారంలో ఉంది.
పురాణ కథ
ఇక చాలా కథలు ఉన్నాయి.. మనువు అనే ఆయన ప్రస్తావన మనకు మత్స్య పురాణంలో కనిపిస్తుంది. ఈయనను భరతుడు అని కూడా అంటారు. ప్రజలకు జన్మనిచ్చి కాపాడిన వాడు మనువు అని ఆ పురాణంలో చెప్పారు. అందుకే మనువును భరతుడు అనేవారు. భరతుడు పాలించిన ప్రాంతం కాబట్టి భరతవర్ష(India story) అని ఈ రాజ్యాన్ని పిలిచేవారు. అంతేకాదు.. జైన మత గ్రంధాలలో కూడా భారత్ ప్రస్తావన ఉంది. ఆ గ్రంధ కథనంలో ఋషభదేవుని పెద్ద కుమారుడు మహాయోగి భరత్ పేరు దేశానికి భారతవర్షగా స్థిరపడింది అని ఉంటుంది.
విష్ణు పురాణం ప్రకారం ”ఉత్తరం యత్సముద్రస్య హితద్రేశ్చైవ దక్షిణం. వర్ష తత్ భరతం నామ్ భారతీ యత్ర సంతతిః.” దీని అర్ధం సముద్రానికి ఉత్తరాన, హిమాలయాలకు దక్షిణాన ఉన్నది భరతవర్ష, మనం దాని బిడ్డలం అని.
కురుక్షేత్రం – భారతదేశం
కురుక్షేత్ర యుద్ధానికీ.. భారత దేశం(India story) పేరుకూ కూడా లింక్ ఉందని చాలా మంది చరిత్ర కారులు చెబుతారు. క్రీస్తు పూర్వం రెండున్నారవేల ఏళ్ల క్రితం ఈ యుద్ధం జరిగినది అని వారి అంచనా. కురు పాండవుల మధ్య పెద్ద యుద్ధం జరిగిన సమయంలో భారత భౌగోళిక సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈ కుటుంబ యుద్ధంలో పాలు పంచుకున్నాయి. వర్ష అంటే ప్రాంతం లేదా భాగం అని సంస్కృతంలో అర్ధం. ఈ యుద్ధంలో త్రిత్సు కుల యోధులు ప్రముఖ పాత్ర పోషించారు. వీరు పది రాష్ట్రాల సమాఖ్యను గెలుచుకున్నారు. నిజానికి ఈ త్రిత్సులను భరతుల సమాఖ్యగా చెప్పుకునే వారు. అంటే వారు భరత్ అనే వ్యక్తుల సమూహం వీరు ఆర్యులలో మాత్రమే ఉండేవారు. భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతంలో ఈ ఆర్యుల సమూహం స్థిరపడింది. వీరి గురించి మొదటగా ఋగ్వేదంలోని ఏడవ మండలంలో చెప్పారు. ఈ త్రిత్సులు పది సమాఖ్యలు గెలుచుకున్న తరువాత వారి ఆధిపత్యం పెరిగింది. వీరు గెలుచుకున్న పది రాష్ట్రాలను కలిపి భారత్ అని పిలిచే వారు.
ఈ కథనాలన్నిటి లోనూ భారత్ ప్రస్తావన ఉంది. భారత్ వర్షగా మన దేశాన్ని పిలిచేవారన్న స్పష్టమైన విషయమూ ఉంది. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. (ఎందుకంటే భారతాన్ని.. రామాయణాన్ని మనం నిజంగా జరిగినవిగానే నమ్ముతాము) మన దేశం భారత దేశం అని పిలవడం చాలా ప్రాచీన కాలం నుంచే ఉందని చెప్పవచ్చు.
ఇదీ మన భారత దేశపు ప్రాచీన కథనాల వెనుక ఉన్న చరిత్ర(India story). మరి ఆధునికంగా ఇండియా ఎలా అయింది.. ఇండియాను భారత్ గా మర్చాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? ప్రభుత్వం చర్యలను ప్రతిపక్షాలు ఎందుకు అంత తీవ్రంగా తప్పుపడుతున్నాయి? అసలు ఈ విషయంలో రాజ్యాంగం ఏమి చెబుతోంది? ఈ విషయాలన్నిటినీ తరువాతి కథానాల్లో చర్చిద్దాం.
గమనిక:
వివిధ జర్నల్స్.. ఆర్టికల్స్ నుంచి ఈ విషయాలను ఇక్కడ చర్చిస్తున్నాం. ఇది కేవలం ఒక అవగాహన కోసమే. ఎటువంటి రాజకీయ ప్రేరణ లేదా ఎటువంటి పార్టీల సమర్ధన చేయడం కోసం ఈ ఆర్టికల్ ఇవ్వడం లేదని గమనించగలరు. ఈ ఆర్టికల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి.విశేషాలు నుంచి ఇటువంటి ఆర్టికల్స్ కోసం www.visheshalu.com ఫాలో అవ్వండి. ఆలాగే visheshalutv యూ ట్యూబ్ ఛానల్ సబ్ స్క్రయిబ్ చేయండి.