Thursday , 12 December 2024
Jagna and RGV Meet Secrets
Jagna and RGV Meet Secrets

ఓహో సీఎం జగన్‌తో ఆర్జీవీ మీటింగ్ అందుకేనా? అబ్బా అంత స్కెచ్ వేసేశారా?

ఇదిగో తోక.. అదిగో పులి.. ఇటువంటి కథనాలకు మన తెలుగురాష్ట్రాల్లో మీడియా బీభత్సం మామూలుగా ఉండదు. నక్కకు నాగలోకానికి ముడిపెట్టడంలో మనకి తిరుగు ఉండదు. ఇదిగో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అదోరకమైన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం ఓ అరగంట పాటు మాట్లాడేసుకున్నారు. ఆ తరువాత జగన్ తన పనికి తాను వెళ్ళిపోయారు. వర్మ మీడియాకు దొరక్కుండా చెక్కేశారు. అంతే.. ఇక మొదలైంది హడావుడి.. వీళ్ళిద్దరూ కలిసారంటే.. ఎవరినో టార్గెట్ చేస్తూ సినిమా తీసేయడానికే అనీ.. కాదు.. కాదు.. జగన్ బయోపిక్ వర్మ పీకే పనిలో ఉన్నారనీ.. అదేమీ కాదు.. ఈమధ్య వర్మ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడారు.. దాని మీద వార్నింగ్ ఇవ్వడానికి జగన్ పిలిచారనీ.. ఇలా.. (ఇవి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు మాత్రమే) ఎవరి కోణంలో వాళ్ళు రెచ్చిపోతున్నారు. మిగిలిన చిన్నా చితకా విశ్లేషణలు.. వాదనలు పక్కన పెడితే.. ఈ మూడు వాదనల గురించి ఒకసారి పరిశీస్తే ఏ మాత్రం వ్యవహార పరిజ్ఞానం ఉన్నవారికైనా కూసింత నవ్వు వస్తుంది.

అసలు పవన్ కళ్యాణ్ మీద సినిమా చేయాలి అని వర్మ అనుకుంటే.. దానికి జగన్ పర్మిషన్ లేదా జగన్ తో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఏదో ఒకటి తీసేసి.. దాన్ని అదోరకంగా ప్రచారం చేసేసి.. వేగంగా ప్రజల మీదకు వదిలేయడంలో వర్మను మించిన వారు లేరనేది తెలిసిందే. పవన్ టార్గెట్ గా సినిమాలు చేయాలి అనుకుంటే.. దాని కోసం ఇటువంటి ఎక్సర్సైజ్ లు వర్మ చేయరు అనేది స్పష్టం.

ఇక జగన్ వర్మకు వార్నింగ్ ఇవ్వడానికి పిలిచారనే వాదన శుద్ధ తప్పనే చెప్పొచ్చు. వర్మ మొదటి నుంచి జగన్ ప్రభుత్వ అనుకూల వాది. ఎప్పుడూ ప్రభుత్వాన్ని మోస్తూ ట్విట్టర్ లో కూస్తూ ఉంటారు. ఎదో ఒకటీ అరా సంఘటనలకు సంబంధించి ప్రభుత్వాన్ని వర్మ విమర్శించినా.. దానిని జగన్ అంత సీరియస్ గా తీసుకుని.. పిలిచేసి క్లాస్ పీకేస్తారని అనుకునే అంత సీన్ లేదు. జగన్ కి చాలా పనులు ఉన్నాయి. వర్మతో ఇలాంటి చిల్లర పంచాయితీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

ఇక చివరిగా చెప్పుకోవాల్సింది.. జగన్ బయోపిక్.. ఇది నిజం అయ్యే అవకాశాలు కొంతవరకూ ఉన్నాయి. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు యాత్ర అనే సినిమాతో వైఎస్సార్ ని అందరికీ గుర్తు చేసి.. దాని నుంచి రాజకీయ లబ్ది పొందిన అనుభవం ఉంది. ఆ కోణంలో జగన్ ఇప్పుడు తన విజయాలు(?) తన మంత్రుల వీరగాథలు.. ప్రభుత్వ ప్రజోపయోగకర కార్యక్రమాలు ఇటువంటివి పోగేసి (ఉన్నా లేకపోయినా) వాటితో ఒ సినిమా తీసి వదిలితే బావుంటుంది అని భావిస్తున్నారని అనుకోవచ్చు. కానీ.. ఇందులోనూ చిన్న తిరకాసు ఉంది. వర్మ ముప్ఫై రోజుల్లో సినిమా చుట్టేసే కెపాసిటీ ఉన్న మనిషి. పైగా జగన్ అయినా.. మరొకరైనా వారి చరిత్ర సినిమాగా తీయాలని అడిగితే దానికి రక్తాన్నో.. మాఫియానో.. బూతుల్నో జోడించేసి మరీ వదిలేయగలరు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. మరి ఇంత స్పీడుగా సినిమాలు తీసేసి వదిలేస్తే.. అది రెండు రోజుల్లో జనాలు మర్చిపోతారు కదా.. జనరల్ గా వర్మ సినిమాలు ఒక్కరోజు లోనే మర్చిపోయేలా ఉంటాయి కానీ, ఎదో వైసీపీ చరిత్ర కదా అని ఆ అభిమానులు చందాలేసుకుని రెండోరోజూ మూడోరోజూ లాగించారని అనుకుందాం.. ఆ తరువాతైనా ప్రజలు ఇది మర్చిపోతారు. పైగా ఇప్పుడు జనాలకి సినిమాలు చూసేసి జ్ఞానం పెంచేసుకుని అయ్యో అని జాలిపడిపోయో.. అబ్బా ఇదంతా నిజమే సుమా అని నమ్మేయడమో చేసేంత తీరిక.. ఓపికా లేవు అనేది అందరికీ తెలిసిందే.

కోట్ల రూపాయల ఖర్చుతో తీసిన సినిమాలో ఉన్న విషయాన్నే.. మీమ్స్ పేరుతో గాయగత్తర చేసేస్తున్నారు. ఇప్పుడు ఆర్జీవీ అనే జీవి ఓ రాజకీయ మసాలా బయోపిక్ తీసి.. ఆ సినిమా వచ్చి.. అది చూసి.. ఓట్లు వేయాలని సామాన్యులు ఎవరైనా పాపం రెడీ అయినా.. ఎన్నికలు వచ్చేసరికి ఈ మీమ్స్ వారి తలల్లోకి కావలసినంత నెగిటివిటీని ఎటకరంగా ఎక్కించేస్తాయి కదా.. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతకు.. ఈ వ్యతిరేకత కూడా కలిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో కదా? అయినా, ఇవన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియనివి కావు కదా! అంచేత.. ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే.. కొన్ని రోజులు మహా అయితే, ఓ మూడు నాలుగు రోజులు ప్రస్తుత ఏపీ రాజకీయ వాతావరణంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల నుంచి మీడియా.. ప్రజల దృష్టి మళ్ళించడానికి మాత్రం జగన్-వర్మ అరగంట మీటింగ్ ఉపయోగపడిందని చెప్పవచ్చు. అంతకు మించి ఎవరైనా ఎక్కువ ఊహించుకోవడానికి ఏమీ లేదు. ఉండదు. ఇంకా చెప్పాలంటే.. వర్మ ఏది చేసినా సరిగ్గా దానికి వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చే పని కోసం వేసే పబ్లిసిటీ ప్లానింగ్ తోనే చేస్తారు. అది జగన్ తో మీటింగ్ అయినా.. లైగర్ లాంటి సినిమాల ప్రమోషన్ అయినా.. ఏదైనా అర్జీవీకి ఒక్కటే. ఎవరు ఏమడిగినా ఆయన రెడీమేడ్ సమాధనమూ ఒక్కటే.. తెలుసుగా.. నా ఇష్టం!

Check Also

Zimbabwe Vs India T20

Zimbabwe Vs India T20: ఒక్కరోజే.. టీమిండియా గేర్ మార్చింది.. జింబాబ్వే గిలగిల లాడింది! అదరగొట్టిన భారత్ కుర్రాళ్లు !

Zimbabwe Vs India T20: జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆదివారం భారత జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది.

Pawan Kalyan

Pawan Kalyan: వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చనీ, ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమిచవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.

ap telangana cms meet

AP Telangana CMs Meet: చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. ముగిసిన ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల బేఠీ!

హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పది కీలక అంశాలపై చర్చించారు.

One comment

  1. V.V.Satyanarayana.Pabbu

    Good Analysis 💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *