సినిమా అంటేనే నవరసాల మేళవింపు. ఆ తాలింపు సరిగ్గా ఉందా దానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. మంచి కథలు.. కొత్త కథలు.. ఇవన్నీ ఇప్పుడు మనం సినిమాలో(Miss Shetty Mr Polishetty Review) వెతుక్కోలేం. కానీ, చెప్పేవిధానంలో కొత్తదనం కోసం చూస్తాం. ఈ మధ్య కొత్త దర్శకులు.. కొత్తదనాన్ని తీసుకువచ్చి రొటీన్ నుంచి బయట పడేసే ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. అయితే, ప్రేక్షకులను ఎలాగైనా ఆకట్టుకోవాలనే తాపత్రయంతో కొంతమంది కొత్తదనం పేరుతో హద్ధులు దాటిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కానీ, కొందరు దర్శకులు తీసుకున్న పాయింట్ సెన్సిటివ్ అయినా ఎక్కడా హద్ధు మీరకుండా విషయాన్ని వినోదాత్మకంగా చెప్పడంలో విజయవంతం అవుతున్నారు. అటువంటి కొత్త దర్శకుడు మహేష్ బాబు నుంచి వచ్చిందే.. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా. ఇది ముగ్గురి సినిమా. ఒక దర్శకుడు.. ఒక హీరో.. ఒక హీరోయిన్ అంతే. దర్శకుడి కొత్తదన ప్రయత్నంలో ఒదిగిపోయిన హీరోయిన్ అనుష్క.. ఆ కొత్తదనంలో తనని తాను నటుడిగా మరో మెట్టు పైకెక్కేలా చేసుకున్న హీరో నవీన్ పోలిశెట్టి వీరిదే ఈ సినిమా.
కథ అలా..
తల్లి నీడలో స్వతంత్ర భావాలతో పెరిగిన అమ్మాయి.. తల్లి అనుభవాలతో(Miss Shetty Mr Polishetty Review) పెళ్లి అంటేనే వద్దు అని నిర్ణయించుకుంటుంది. అయితే, తనకు ఒక బిడ్డ కావాలని అనుకుంటుంది. అది కూడా మగ తోడు లేకుండా.. మరోవైపు మధ్యతరగతికి చెందిన ఒక యువకుడు స్టాండప్ కామెడీతో అందర్నీ అలరిస్తూ.. సంప్రదాయం.. విలువల మధ్య హుందాగా బతికేస్తూ ఉంటాడు. పెళ్లి వద్దు.. కానీ పిల్లాడు కావాలి అని అంటున్న అమ్మాయిని ప్రేమించిన ఈ యువకుడికి.. ఆ యువకుడి ద్వారా పిల్లడిని కని తనదారి చూసుకోవాలని భావించిన యువతికి మధ్యలో జరిగిన కథ ఇది. ఇందులో ఐయూవీ అనే పాయింట్ ని వారధిగా చేసుకుని కథని నడిపించాడు దర్శకుడు. తోడు ఉంటే చాలు అనుకునే అమ్మాయి.. ఆ తోడు గుండెల్లో కూడా ఉండాలి అని ఎలా అర్ధం అయింది అనేదే సినిమా. హీరోయిన్ భావోద్వేగాల కథనంతో మొదలైన సినిమా.. హీరో ఎంట్రీతో కామెడీ ట్రాక్ లో పడి అక్కడ నుంచి మళ్ళీ భావోద్వేగాల దారిలోకి వెళ్ళి చివరికి ఒక ఫీల్ గుడ్ సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకుడికి ఇస్తుంది.
కథనం ఇలా..
ఒక చిన్నలైన్ కథతో రెండున్నర గంటల సేపు ప్రేక్షకుడిని కదలకుండా(Miss Shetty Mr Polishetty Review) చేసేలా చేశాడు దర్శకుడు మహేష్. హీరోయిన్ కోణంలోంచి సినిమా ప్రారంభించి.. హీరోను కూడా ఆమె ప్రపంచంలో పడేసి.. చివరికి ఇద్దరి మధ్య బంధాన్ని సున్నితంగా ప్రేక్షకుల మదిలోకి బలంగా తీసుకువెళ్లారు మహేష్. కథనం పెద్ద స్పీడ్ గా ఉండకపోయినా.. ఎక్కడా ప్రేక్షకుడికి ఆ ఫీల్ వచ్చే అవకాశమే లేకుండా సీన్స్ రాసుకున్నాడు. కొత్త లైన్ కాకపోయినా.. మరీ కొత్త కథ కాకపోయినా.. తీసుకున్న పాయింట్ కాస్త బొల్డ్ పాయింట్ అయినా.. కుటుంబం అంతా కలిసి కూచుని ఎంజాయ్ చేసే సినిమాగా తీర్చి దిద్దారు మహేష్. సినిమాలో వచ్చే కొన్ని సందర్భాలలో బొల్డ్ విషయాన్ని సున్నితంగా వెల్లడించి తనలోని ప్రతిభను చాటుకున్నాడు.
ఎవరెలా అంటే..
ఇక చాలారోజుల తరువాత తెరపై కనిపించిన అనుష్క(Anushka).. మొదటి నుంచి చివరి వరకూ ప్రతి సన్నివేశంలోనూ హుందాగా నటించారు. భావోద్వేగాల మధ్య.. తన ఆలోచనల మధ్య ఉండే సంఘర్షణని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఈ పాత్ర తనకోసమే(Miss Shetty Mr Polishetty Review) అన్నట్టుగా చేశారు. ఇప్పటికే తనదైన శైలిలో వినోదానికి పెద్దపీట వేసే సినిమాల్లో కనిపించి ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం సంపాదించిన నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) కాకుండా ఇంకొకరు హీరోగా అయితే చూడలేం అనే స్థాయిలో తన పాత్రలో ఒదిగి పోయారు. వినోదభరితమైన నటన తో అలరించే నవీన్.. అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్ దగ్గర.. ఆమెనే కొన్ని సీన్లలో డామినేట్ చేసే విధంగా భావోద్వేగాలను పండించారు. ఇక సినిమాలో జయసుధ, తులసి, మురళీ శర్మ, సోనియా, అభినవ్, నాజర్ వెళ్లంతా తమ పరిధిలో సినిమాకి ప్లస్ అయ్యారు.
టెక్నికల్ గా ఎలా అంటే..
టెక్నికల్ గా చెప్పుకోవాలంటే.. సినిమా ఫోటోగ్రఫీ చాలా బావుంది. లండన్ దృశ్యాలు.. నీరవ్ షా చక్కగా చూపించారు. రధన్ సంగీతం విషయానికి వస్తే పాటలు ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. అయితే, నేపధ్య సంగీతం ఇచ్చిన గోపీ సుందర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ అయ్యేలా చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కూడా బావుంది. ఇక సినిమా నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూవీ క్రియేషన్స్ అంటేనే భారీ స్థాయి.. చిన్న కథ.. చిన్న సినిమా అయినా ఎక్కడా రాజీపడకుండా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
అలా వుంది..
మొత్తమ్మీద ఈ మిస్ అండ్ మిస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చక్కని కథ.. చిక్కని కథనం.. ప్రాణం పోసిన ఆర్టిస్ట్స్.. అన్నిటినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన దర్శకుడు.. అన్నట్టు.. చివరిగా చెప్పినా సినిమాలో డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి. ప్రతి స్టాండప్ కామెడీ పంచ్ అదిరిపోయింది. థియేటర్లో ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. అదే స్థాయిలో ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.
చివరిగా.. సున్నితమైన విషయాన్ని అంతే సున్నితమైన హాస్యంతో.. గాఢమైన ఎమోషన్స్ ని అదే స్థాయిలో.. చూపించిన సినిమా. ఎమోషనల్ పాయింట్ కి వినోదపు టచ్ తో ప్రేక్షకులకు చిరునవ్వులు పంచిన సినిమా!
ఇది రివ్యూయర్ సొంత అభిప్రాయం మాత్రమె. దీనిని అయన వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమె చూడాల్సిందిగా కోరుతున్నాం