Super Star Krishna: వినీలాకాశంలో చుక్కల దరికి సూపర్ స్టార్.. నిత్య సాహసికి నివాళి

Super Star Krishan Death

ఎక్కడ మొదలు పెట్టాలి? ఎవరి గురించి అయినా చెప్పాలి అనుకున్నపుడు వచ్చే మొదటి ప్రశ్న ఇది.. వెంటనే ఎదో మొదలు పెట్టాలి కనుక మొదలు పెట్టి ఆనక తాపీగా ఆ కథనం పూర్తి చేసేస్తాం. కానీ.. అందరి విషయంలో అలా చేయలేం. ఇప్పుడూ అదే సందిగ్ధం.. ఆయన వెళ్ళిపోయారు. ఎవరూ అందుకోలేని నట శిఖరాలను అందుకున్న నటుడు.. ఎవరికీ తలవంచే పధ్ధతి తెలీని వ్యక్తీ.. ఏటికి ఎదురీది విజయాన్ని అందుకోవాలనే సాహసి.. జీవితం చాలించారు. నట శేఖర్ కృష్ణ ఇక లేరు. ఇన్ని సినిమాల్లో నటించారు.. ఇన్ని హిట్లు ఉన్నాయి.. ఎంత పెద్ద హీరో ఇలా సామాన్యంగా చెప్పేసే వ్యక్తీ కాదు కృష్ణ. హిట్లూ.. ప్లాపులూ వీటన్నిటికీ చాలా ఆతీతంగా ఎదిగిన వ్యక్తీ. సినిమాల్లోకి సాధారణంగా ప్రవేశించి.. ఎంతో ట్రోలింగ్ భరించి.. చరిత్ర మర్చిపోలేని సినిమాలను నిర్మించి.. తెలుగు సినిమాకు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ హంగులు చేర్చి మెరిపించిన కళాకారుడు కృష్ణ.

కృష్ణ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా అల్లూరి సీతారామరాజు.. ఆయన సినీ జీవితం అంతా సీతారామరాజు లానే విప్లవాత్మకంగానే సాగింది. తానూ నమ్మిందే చేశారు. రాజీకి ఎక్కడా తావు లేదు. ఎన్టీఆర్ దానవీరశూకర్ణ అంటే కురుక్షేత్రం తీసి తల ఎగరేశారు.. కారణాలు ఏమైనా తనకు ఇబ్బంది కలిగించిన పెద్ద గాయకుడిని పక్కన పెట్టి కొత్త గాయకుడితోఅప్పటివరకూ తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద బడ్జెట్ తో తొలిసారి 70 ఎంఎంలో అప్పటికి అత్యాధునికమైన టెక్నాలజీతో సింహాసనం సినిమా తీసి.. హిట్టు కొట్టిన సాహసి. ఆ సినిమా పాటలు సూపర్ హిట్.. ఇలా ఎన్నో సందర్భాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే కాళ్ళు పట్టుకునే తత్వానికి ఎదురీది భళా అనిపించుకున్న వ్యక్తిత్వం ఆయనది. నమ్మిందే చేశారు.. నమ్మకంతో చేశారు.. నమ్మకంగా నిలిచారు.. నమ్మకాన్ని గెలిపించారు. అప్పట్లో ఆయనతో కలిసి నటించిన చిన్న నటులు ఎన్నో సార్లు తెరవెనుక కృష గురించి చెపారు. సెట్ లో అందరూ భోజనం చేశారా లేదా అనేది తెలుసుకున్న తరువాతనే ఆయన భోజనం చేశేవారు.

ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇంజనీరింగ్ చదవాలనే ప్రయత్నం పక్కన పెట్టి.. సినిమాలపై మోజుతో చెన్నై చేరిన బుర్రిపాలెం బుల్లోడు. క్రమ క్రమంగా తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఒక్క సంవత్సరంలో 18 సినిమాల్లో హీరోగా కనిపించిన ఘనత ప్రపంచ సినీ చరిత్రలోనే కృష్ణకు మాత్రమే సొంతం అయిన రికార్డు. మొదటి గూఢచారి సినిమా.. తొలి సినిమా స్కోప్ సినిమా.. తొలి 70 ఎంఎం సినిమా ఇలా ప్రతిసారీ ఎదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సాహసి కృష్ణ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తో మంచి స్నేహం కృష్ణకు ఉంది. ఆ స్నేహ బంధంతోనే కాంగ్రెస్ పార్టీలో 1984లో చేరారు కృష్ణ. ఆ తరువాత ఏలూరు నుంచి 89 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపు సాధించారు. కానీ 91 ఎన్నికల్లో అదే ఏలూరులో ఓటమి చూశారు. తరువాత రాజకీయాలకు దూరం జరిగిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా సినిమాలు తీశారు కృష్ణ. అప్పట్లో ఆ సినిమాలు ఒక సంచలనం. రాజకీయంగా అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా వ్యంగ్యంతో సినిమాలు తీసిన ధైర్యం చేసింది మొదట కృష్ణ మాత్రమే. 2010 నుంచి సినిమాలు తగ్గించుకుంటూ వచ్చిన కృష్ణ చివరిసారిగా తెరపై కనిపించింది 2016లో శ్రీశ్రీ అనే సినిమాలో. 79 ఏళ్ల జీవితంలో దాదాపు 50 ఏళ్ల పాటు సినిమా ప్రేక్షకులను అలరించిన కృష్ణ ఇక సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.

కృష్ణ వివాహం 1965లో ఇందిరతో జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. గత ఆరు నెలల్లో కృష్ణ కుటుంబంలో ఇది మూడో మరణం. పెద్ద కొడుకు రమేష్ బాబు అకస్మాత్తుగా మరణించారు. తరువాత ఆయన భార్య ఇందిర మృతి చెందారు. ఇప్పుడు కృష్ణ. ఆరునెలల్లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు జీవితం చాలించడం పెద్ద విషాదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *