Chandra Babu Naidu: తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఏపీలో గెలుపు కోసం పరోక్షంగా కృషి చేశారని చెప్పిన ఆయన ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లని వ్యాఖ్యానించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన చంద్రబాబుకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.
Chandra Babu Naidu: “నేను నా బంధువులను అభినందించడానికి వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. ఏపీలో గెలుపు కోసం తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు. ఎన్టీఆర్ ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ఆయన. తెలంగాణలో అధికారంలో లేకపోయినా కార్యకర్తలు పార్టీని వీడలేదు. పార్టీ నాయకులు తప్ప కార్యకర్తలు ఎవరూ మరోవైపు వెళ్లలేదు. తెలుగు దేశం ఉన్నంత కాలం టీడీపీ జెండా ఇక్కడ రెపరెపలాడుతుంది. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని మళ్లీ అధికారంలోకి వచ్చాం. నన్ను జైల్లో పెట్టినప్పుడు తెలంగాణ టీడీపీ శ్రేణులు చూపిన చొరవ మరిచిపోలేను. నా అరెస్టుకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరసనలు జరిగాయి. ఆ సమయంలో గచ్చిబౌలిలో జరిగిన సభను మర్చిపోలేను. హైదరాబాద్‌లో నాకు మద్దతుగా నిర్వహించిన నిరసనలను టెలివిజన్‌లో చూసి గర్వపడ్డాను.” అంటూ తెలంగాణ టీడీపీ కార్యకర్తలకు తన కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు.
Also Read: చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. ముగిసిన ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల బేఠీ!
Chandra Babu Naidu: “టీడీపీ నాలెడ్జ్ ఎకానమీని ప్రారంభించింది. విభజన సమస్యల పరిష్కారానికి నేను చొరవ తీసుకున్నాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి స్వాగతం పలికారు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత అవసరం. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను కాపాడాలి. ఏపీ, తెలంగాణల అభివృద్ధి టీడీపీ ధ్యేయంగా పనిచేస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడితే నష్టమే ఎక్కువ. మార్పిడి ధోరణితో మాత్రమే సమస్యలు పరిష్కరించుకోగలుగుతాము. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలున్నాయి. సిద్ధాంతపరంగా భిన్నమైన ఆలోచనలున్నప్పటికీ తెలుగుజాతి ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేస్తాం. 2019 తర్వాత ఏపీలో విధ్వంసకర ప్రభుత్వం ఉంది. విభజన కంటే వైసీపీ ప్రభుత్వం చేసిన నష్టమే ఆంధ్ర ప్రదేశ్ కు ఎక్కువ.” అంటూ చంద్రబాబు చెప్పారు.
“ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి 70 రైళ్లలో ప్రజలు చేరుకున్నారు. వేల రూపాయలు వెచ్చించి ఎన్నారైలు వచ్చారు. ఏపీ ఎన్నికల్లో అందరూ ఓటేయడంతో సునామీ వచ్చింది. గతంలో ఏపీలో ఉన్న దెయ్యాన్ని చూసి కంపెనీలు రాలేదు.” అని చంద్రబాబు అన్నారు.