Union Budget 2024: మోడీ 3.0 ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను జూలై 24న సమర్పించవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఆర్థిక సర్వే నివేదికను జూలై 23న పార్లమెంటు కు సమర్పించనున్నారు. 24 న బడ్జెట్ సమర్పణ ఉంటుంది. ఈసారి ప్రభుత్వ విధానంలో రైతులు, పేదలు, యువత, మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్రపతి తన ప్రసంగంలో సూచించారు. దీంతో ఈసారి బడ్జెట్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైనా కొత్త స్థాయి అంచనాలు తలెత్తుతాయి. అదేవిధంగా మోడీ 3.0 ప్రభుత్వ తొలి బడ్జెట్‌పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే బడ్జెట్ తయారీలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. జూలై చివరి వారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జులై 22న బడ్జెట్ ఉండవచ్చని అనుకున్నారు. అయితే, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక రిపోర్ట్ ప్రకారం, పూర్తి ముందస్తు బిల్లు (Union Budget 2024) జూలై 24న పార్లమెంటులో సమర్పించవచ్చు. వార్తాపత్రిక మూలాలను ఉటంకిస్తూ ఈ అంచనా వేసింది.
Also Read: డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..
Union Budget 2024: పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పేదలు, యువత, మహిళలు, రైతులకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సుదూర ఆర్థిక, సామాజిక సంస్కరణలు ఆవిష్కృతమవుతాయని ఆమె ముందే ఊహించారు. అలాగే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో ఎన్నో చారిత్రాత్మక చర్యలు తీసుకుంటామన్నారు.ఈ ప్రసంగం ఆధారంగా ఈసారి బడ్జెట్ పై అందరిలో చాలా అంచనాలు ఉన్నాయి. మరి బడ్జెట్ లో ఎంతవరకూ వాటిని నెరవేరుస్తారనేది తేలాల్సి ఉంది.