కృష్ణ.. నటశేఖరుడే కాదు.. అందరివాడు కూడా. సినిమా అందులో హీరో అంటే ఉండే అభిజాత్యాలకు ఈ సూపర్ స్టార్ చాలా దూరం. ఎప్పుడూ ఎక్కడా అతి ప్రదర్శన అది సినిమాల్లో కానీ.. నిజ జీవితంలో కానీ కృష్ణ చేయలేదు. నిజానికి కృష్ణ జీవితంలో కూడా హీరో. ఎందుకంటే.. తాను నమ్మిన విధంగా జీవించడం. దానిలో వచ్చే అడ్డంకుల్ని తన బయట వదలకుండా అధిగమించడం. ఎక్కడా తత్తర పాటు లేకుండా జీవన యానం సాగించడం. అందుకే కృష్ణ నిజమైన సూపర్ స్టార్.
అభిమానుల్లో కృష్ణ అభిమానులు వేరు..
సినిమా అభిమానులు అందులోనూ మన దక్షిణాదిలో హీరో అభిమానులు ఒక్కోసారి చాలా భయపెడతారు. తమ హీరో గొప్ప అంటూ వారు చేసే చేష్టలు భరించడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ.. నటశేఖర్ కృష్ణ అభిమానులు మాత్రం డిఫరెంట్. తమ హీరోను ఎంత అభిమానిస్తారో అంతా అనకువగానూ మేలుగుతారు. ఎక్కడా ఇతర హీరోలు లేదా వారి అభిమానులు కించపరిచే వ్యాఖ్యలు చేయడం కనిపించదు. అంతే కాదు ఎక్కడ కూడా తమ సభ్యతను దాటి కృష్ణ అభిమానులు ప్రవర్తించిన ఘటనలు ఎప్పుడూ కనిపించలేదు. కృష్ణ సినిమాల్లో ఒక రేంజిలో ఉన్నపుడు కానీ.. సినిమాల నుంచి క్రమంగా పక్కకు జరిగినపుడు కానీ.. రాజకీయాల్లో కృష్ణ ప్రవేశించినపుడు లేదా రాజకీయాలను వదిలివేసినపుడు ఎప్పుడూ కూడా కృష్ణ అభిమానులు గీత దాటలేదనేది వాస్తవం. సినీ హీరోల అభిమానుల్లో కృష్ణ అభిమానుల తీరు వేరు అనేది స్పష్టం. అదే ఒరవడి ఇప్పుడు మహేష్ అభిమానులలోనూ కనిపిస్తుంది.
నెంబర్ వన్..
NTR తర్వాత నెంబర్ వన్ స్థానం చాలా కొద్ది సంవత్సరాల పాటు కృష్ణతోనే ఉంది. ఎన్టీఆర్ తరువాత సినిమా రంగంలో చాలా మార్పులు వేగంగా చోటుచేసుకున్నాయి. వాటిని కూడా సమర్ధంగా అందిపుచ్చుకున్నారు కృష్ణ. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని చాలా మంది చెబుతారు. కానీ, కృష్ణ ఎక్కడ తగ్గకుండానే సినిమా ప్రపంచంలో ఒక అద్భుతంగా నెగ్గారు. ఒక సక్సెస్ ఫుల్ మనిషిగా నిలిచారు.
రాజకీయాలు.. సరిపడలేదు..
ఇక రాజీవ్ గాంధీ తో స్నేహబంధం కోసం రాజకీయాల్లోకి వచ్చినా.. దానివలన ఆయన లాభపడింది లేదు. ఇంకా చెప్పాలంటే నష్టమే ఎక్కువ భరించారు. తనకు కుదరని పని అని తెలిసిన వెంటనే హుందాగా రాజకీయాలకు దూరంగా జరిగారు. అంతకు మించిన హుందా తనాన్ని సినిమా రాజకీయాల్లోనూ చూపించారు. సినిమా రాజకీయాల్లో ఏరోజూ ఆయన తలదూర్చలేదు. తనకి ఎవరితోనైనా విబేధాలు ఉంటే హుందాగా వారిని పక్కన పెట్టి తన పని తాను చూసుకున్నారు. సక్సెస్ కొట్టారు. ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీ రాజకీయాల్లో నేరుగా కలుగచేసుకోలేదు. ఇండస్ట్రీ పెద్దగా ఉండాలనే తపన పడలేదు. అందుకే అందరివాడుగా కృష్ణ మిగిలిపోయారు.
నిర్మాతల హీరో..
ఇక కృష్ణ గురించి చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. నిర్మాతలతో ఆయన వ్యవహారశైలి. ఒక సినిమా విడుదల అయిన వెంటనే ఆయన తన నిర్మాతకు ఫోన్ చేసి ఎలా వుంది టాక్ అని అడిగేవారట. సినిమా ప్లాప్ అని ఆ నిర్మాత చెబితే.. ఒకే నెక్స్ట్ సినిమాకి రెడీ చేసుకో అని చెప్పేవారట. ఆ తరువాత సినిమాని ఫ్రీగానే చేసేవారు కృష్ణ. ఆ సినిమా హిట్ అయినా ఏ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకునే వారు కాదని చాలామంది నిర్మాతలు చెబుతారు. అంతేకాదు.. ఒక్కొసారి నష్టపోయిన నిర్మాతకు తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన రోజులూ ఉన్నాయి. అసలు ఇలా ఒక హీరో నిర్మాతల కోసం ఆలోచించి.. ఫ్లాప్ అయిన సినిమాల కోసం తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వడం అనేది కృష్ణ మాత్రమే చేశారు. అందుకే ఆయన తెలుగు సినిమాపై ఎప్పటికీ సూపర్ స్టార్ గా నిలిచిపోయారు.