రామాయణం.. ఈ మాట వింటేనే చాలు భారతీయులకు పులకరింత. శ్రీరాముడు ఈ పేరు వింటేనే చాలు అందరి మనసుల్లోనూ ఆహ్లాదం పొంగిపోతుంది. రామాయణం(Adipurush Movie Review) ఇతిహాసమా.. పుక్కిట పురణమా.. దేవుని లీలల పేరుతో వచ్చిన మామూలు కథనమా.. ఇలాంటి వాదనలు పక్కన పెడితే.. వందలాది ఏళ్లుగా.. ప్రజానీకం మనసు పొరల్లో నిక్షిప్తం అయిపోయి.. ఇంటిపేరు ఎలా అయితే తరాల మధ్య ట్రావెల్ చేస్తుందో అలా మన తరాలు మారిపోతున్నా రామాయణం మన జీవితాలతో ప్రయాణం చేస్తూనే ఉంది. వాల్మీకి రామాయణం దగ్గర నుంచి.. ఇప్పటివరకూ రామచరితను ఎందరో మహానుభావులు తమదైన వ్యక్తీకరణతో మన ముందుకు తీసుకువచ్చారు. ఇక మన సినిమాల విషయానికి వస్తే రామాయణం(Adipurush Movie Review) ప్రత్యేకంగా వచ్చిన సినిమాలు.. టీవీ సీరియాళ్ళూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. అసలు ప్రతి సినిమా కథకి ఆధారమే రామాయణంలోని కథనం అవుతూ వస్తోంది. ఒక హీరో.. ఒక హీరోయిన్.. ఒక విలన్.. వీరి మధ్య జరిగే సంఘర్షణ.. అది లవ్.. హారర్.. కామెడీ.. ఏ జోనర్ కైనా ఉండే కామన్ పాయింట్.. అందుకే రామాయణం అందరికీ అంత దగ్గరగా అనిపిస్తుంది. అయినా ఏ కథ అయినా మంచీకీ చెడుకీ మధ్య జరిగిన సంఘర్షణ ఆధారంగానే ఉంటుంది కదా.
ఇవన్నీ పక్కన పెడితే రామాయణాన్ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నామంటూ దర్శకుడు ఓం రౌత్ ముందుకు వచ్చారు. ఆదిపురుష్(Adipurush Movie Review) పేరుతో భారీ బడ్జెట్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని రామునిగా చూపిస్తూ పాన్ వరల్డ్ రేంజిలో సినిమాని తెరకెక్కించారు. సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచి విడుదల వరకూ ఎన్నో వివాదాల మధ్య సుదీర్ఘ షూటింగ్ జరుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ టీజర్ తో విమర్శలు పాలైన సినిమా యూనిట్.. సినిమా విడుదలకు ముందు సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచే విధంగా టీజర్స్.. ట్రైలర్స్ వదిలింది. భారీగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించింది. దీంతో సినిమా ఊహించిన దానికన్నా ఎక్కువగా బిజినెస్ జరుపుకుంది. ఈ నేపధ్యంలో సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకుల అంచనాలు అందుకుందా? ఓం రౌత్ రామాయణ కథకు న్యాయం చేశారా? ప్రభాస్ రాముడిగా మార్కులు కొట్టారా? ఇప్పుడు తెలుసుకుందాం..
వాల్మీకి రామాయణం.. మొల్ల రామాయణం.. దాశరధి రామాయణం.. ఇలా ఎన్నో రామాయణాలు మనకు పుస్తక రూపంలో కనిపిస్తాయి. వాటిలో వేటికి అదే ప్రత్యేకం. ఆయా రచయిత వ్యక్తీకరణ ఎవరికి వారికే స్పెషల్. అలాగే మన సినిమాల్లో రామాయణ కథ విషయానికి వస్తే బాపూరామాయణం.. ఎన్టీఆర్ రామాయణం.. రాఘవేంద్రుని రామాయణం.. రామానంద సాగర్ రామాయణం ఇలా చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా ఆయా దర్శకుల అవగాహన మేరకు వారి క్రియేటివిటీకి అనుగుణంగా వచ్చినవే. ఇప్పుడు అదే కోవలో వచ్చిందే ఈ ఆది పురుష్. ఇది ఓం రౌత్ రామాయణం(Adipurush Movie Review) అంతే. రామాయణం మూల కథలోని కొన్ని ఘట్టాలను తీసుకుని వాటిని వరుసగా పర్చుకుని.. ఆధునికమైన గ్రాఫిక్స్ హంగుల్నీ భారీగా చేర్చి.. ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు ఓం రౌత్. కాలం తీసే పరుగులో వచ్చే టెక్నాలజీ మార్పుల ఒరవడిని రామాయణానికి అద్ధి.. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించాలని చేసిన ప్రయత్నం ఇది. ఇందులో ఓం రౌత్ సక్సెస్ అయ్యారా అంటే పూర్తిగా అవును అని చెప్పలేం. సినిమా కథ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ.. ఓం రౌత్ చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉంది అనేది ఒక సారి పరిశీలన చేయవచ్చు..
సినిమా మొదటి భాగం ఒక రకమైన విజువల్ వండర్.. రెండో భాగం మరో రకమైన విజువల్ వండర్. ఆలానే దీనిని తీయాలని అనుకున్నట్టున్నారు. సీతారాముల పాత్రలకు అంతెందుకు రామాయణ పాత్రలకు తొలిసారిగా వేరే పేర్లను పెట్టారు. అక్కడే ఓం రౌత్ ఒకరకమైన మార్పును ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తన సినిమా పూర్తి భిన్నంగా సాగుతుంది అనే సంకేతాలు ఇచ్చారు. అందుకే ఆదిపురుష్ సినిమా పై వివాదాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు సినిమా(Adipurush Movie Review) చూసిన వారికి మొదటి అర్ధ భాగం తప్పితే రెండో అర్ధ భాగంలో ఎక్కడా రామాయణం చూస్తున్నట్టు అనిపించదు. సినిమా ఫస్ట్ హాఫ్ లో రాఘవ.. జానకి మధ్య వచ్చే సన్నివేశాలు.. వాటి గ్రాఫిక్స్ చాలా అందంగా వచ్చాయి. ప్రతి సన్నివేశం క్లీన్ గా కనిపించింది. రాఘవ వీరోచిత ప్రదర్శన.. శేషు జానకిని కాపాడటం కోసం చేసే ప్రయత్నాలు.. బంగారు లేడి సన్నివేశాలు.. అన్నిటికీ మించి రాఘవ.. జనకీలను పాటలలో చూపించిన విధానం చాలా బావుంది. ఇక సెకండ్ హాఫ్ లో అంతా యుద్ధ సన్నివేశాలతో నింపేశారు. రావణ్ నుంచి జానకిని విడిపించి తీసుకురావడం కోసం రాఘవుడు చేసే ప్రయత్నాలు.. వానర సేన సహాయం కోసం వాలిని చంపే సన్నివేశంతో మొదలు పెట్టి చివరకు రావణ సంహారం వరకూ మొత్తం గ్రాఫిక్స్ తో నింపేశారు. ఒక సూపర్ హీరో సినిమా చూసినట్టు అంటే స్పైడర్ మాన్ లాంటి సినిమాలను తెలుగు డబ్బింగ్ వెర్షన్ చూసినట్టు ఉంటుంది తప్ప ఎక్కడా మనం రామాయణం చూస్తున్నాం.. రాముని కథ చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదు. పైగా ప్రతి సన్నివేశమూ.. విపరీతమైన లాగ్. క్లైమాక్స్ అయితే సూపర్ హీరోల సినిమాలు ఇష్టపడే వారికీ ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.
సినిమా కథనం గురించి చెప్పుకోవడానికీ ఏమీ లేదు. కానీ టెక్నికల్ గా మాత్రం చాలా బాగుంది. సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది అని చెప్పవచ్చు. ఎక్కడైనా సన్నివేశాలు కాస్ట్ వీక్ గా అనిపించినా.. దానిని బీజీఎం కవర్ చేసేసింది. ఫోటో గ్రఫీ చాలా బావుంది. విజువల్ గా నెక్స్ట్ లెవెల్ లో ఆదిపురుష్ నిలిచింది.
ఇక రాఘవగా ప్రభాస్ నూరు శాతం న్యాయం చేశారు. జానకి గా కృతి సనన్ ఆకట్టుకున్నారు.. అయితే, ఆమెకు ఎక్కువ స్కోప్ లేదు. ఉన్న సీన్ల వరకూ కృతి చాలా బాగా చేశారు. ఇక మిగిలిన వారు అంతా కూడా పాత్రలకు తగినట్టు చేశారు. రావణ్ పాత్ర చేసిన సైఫ్ ప్రయత్నం చేశారు కానీ.. గ్రాఫిక్స్ బంధంలో చిక్కుకుపోయారు.
మొత్తంగా చూసుకుంటే.. ఇది ఓం రౌత్ రామాయణం.. మోడ్రన్ విజువల్ రాఘవుని కథ… ఏమోషన్స్ కి ప్రాధాన్యం ఇవ్వని రాఘవ.. జానకీల నెక్ట్స్ జెనరేషన్ కథాయణం.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది టింగ్లీష్ రామాయణం!!
ముఖ్య తారాగణం: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వస్తల్ సేథ్
సంగీతహమ్: అజయ్ -అతుల్ బీజీఎం: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
సినిమాటోగ్రఫీ: కార్తిక్ పళణి
ఎడిటింగ్: అపూర్వ మోత్వాలే సాహాయ్, అనిష్ మహత్రే
నిర్మాతలు: భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్ రాజేశ్ నాయర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం రౌత్